మన ‘లో ’ మాట
గమనిక
ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నఈ వ్యాసం చాలా సామాన్యమైనది.
దీని వల్ల పండితులకూ, ఙ్ఞానులకూ ఉపయోగం
ఉండదు.
ఇది పూర్తిగా సామాన్యులను, నా
వంటి మామూలు మనుషులను,
మాత్రమే ఉద్దేశించి రాసినదని మనవి.
- గౌతమ్ కశ్యప్
మనం ఒక్కోసారి మన బంధువులతో కానీ ఫ్రెండ్స్ తో కానీ...
"నేను
నాకు తోచినట్టు వుంటాను. నాకు
నచ్చినట్టు మాట్లాడతాను, ఎవరినో
నేనెందుకు లెక్కచెయ్యాలి? ఈ లోకాన్ని
నేను లెక్కచెయ్యను. నా సంతోషం, నా
సుఖం, నాకు ముఖ్యం" అని అంటూ వుంటాం.
"ఏదో మంచిగా మాట్లాడాలని ప్రయత్నించడం, మెచ్చుకుంటూ
మాట్లాడడం ఇదంతా నేను చెయ్యను. నేను ఎవరినీ మోసం
చెయ్యడం లేదు కద... అలా బతకాల్సిన అవసరం నాకు లేదు. ఆ మాటలు... అదంతా హిపోక్రసీ... డిప్లమసీ పేరుతో నడిచే హిపోక్రసీ... నాకదంతా అసహ్యం" అని కూడా అంటూ వుంటాం.
నిజానికి మనం అలా మాట్లాడే మాటలు చాలా వరకూ అంతగా ఆలోచించి మాట్లాడే మాటలు కావు. మన సహనం
కొంత సన్నగిల్లినప్పుడు ఏదో ఒక ఆవేశంలోనో ఆవేదనలోనో
ఎవరైనా ఏదైనా మనల్నిఅనవసరంగా విమర్శించినప్పుడో, తిట్టి వెళ్లిపోయినప్పుడో,
ఆ బాధలో, విసుగులో, అలా
అనుకోవడం ఆలోచించడం, సహజం.
అయితే అలా మాట్లాడడం వల్ల మనం వారిని లెక్కచెయ్యడం లేదనీ, వాళ్లని తీసిపారేస్తున్నామని, అవమానిస్తున్నామనీ
కూడా అనుకునే అవకాశం ఎంతైనా వుంది. పైగా మనం అలాంటి మాటల్ని ఎంతో స్వేచ్చగా మనకు
చాలా ఆత్మీయమైన బంధువుల ముందో స్నేహితుల ముందో అంటూ వుంటాం. అయితే ఈ తీరు వారి
మనసుకు చాలా బాధా, కష్టం కలిగే అవకాశం ఎంతో వుంది. అందులోనూ
మనకు మనసారా మంచి చెయ్యాలని అనుకునే వారికి ముఖ్యంగా మనల్ని అభిమానించి మన దగ్గరకు
వచ్చిన మిత్రులకు. ఇంకా బాధ ఎక్కువౌతుంది. అటువంటి మాటలు మనకూ మనల్ని మనతో
జీవించేవారికీ కూడా ఎన్నో నష్టాల్నీ, కష్టాల్నీ
తెచ్చిపెడతాయి.
మనం మాట్లాడే మాటలను గురించి, మానవాళి మీద
అనంతమైన అక్కరతో, ప్రేమతో లోకం లోని మనుషుల వాక్కు ను
గురించి ఎంతో లోతుగా, ఎంతో విచక్షణతో, పరిశోధన
చేసిన తత్త్వవేత్తలూ, ఋషులు, గురువులూ,
పెద్దలూ, ఏమంటున్నారో తెలుసుకుందాం.
నిజానికి మనం
ప్రతిరోజూ ప్రతిసారీ, మాట్లాడే మాటల గురించి కొంచెం
ఆలోచించి చూస్తే, అవి కేవలం కర్త, కర్మ, క్రియ వున్న 'శబ్దాలు' మాత్రమే.
అవి నిజమైన మాటలూ కావు. నిజమైన వాక్యాలూ కావు.
మరి ఆ ’నిజమైన’ మాటలంటే ఏవిటి?
నిజమైన ’వాక్యాలంటే..!. కొంచెం తెలుసుకుందాం.
మహా మహా పండితులంతా తలవంచి నమస్కరించే ’అమరకోశం’
అనే మహోన్నతమైన సంస్కృత గ్రంథం ‘వాక్యాన్ని ఇలా నిర్వచించింది.
"యత్ వక్తుం యోగ్యమితిః తత్ వాక్యమ్" - అమర కోశం
’
’ఏదైతే మాట్లాడానికి
యోగ్యత కలిగి వున్నదో అదే వాక్యము’ అని అర్థం.
అంటే మాట్లాడడానికి యోగ్యమైన
మాటలతో ఉంటేనే
ఆ వాక్యం వాక్యమని అర్థం.
వాటినే 'నిజమై’న 'విలువైన'
వాక్యాలుగా గుర్తిస్తారని అర్థం,
మిగిలినదంతా వ్యర్థం, అనర్థం అని కూడా అర్థం.
ఇక
నాట్యశాస్త్రాన్ని, నాట్యవేదమని, పంచమ వేదమని, చతుర్వేదసారమని మహాకవులూ పండితులూ,
ఋషులూ కీర్తించారు. మరి ఆ నాట్యశాస్త్ర సృష్టికర్త అయిన భరతముని
వాక్కును గురించి ఏమంటున్నాడో చూద్దాం
" వాక్కు అంటే అగ్ని, వాఙ్మయం అంటే అగ్ని మయం అని
అర్థం.
అగ్నిని మనం ఎక్కడ
పడితే అక్కడ పెట్టకుండా
ఎలా ఎంత జాగ్రత్తగా దానిని
ఉంచవలసిన చోటులోనే ఉంచుతామో
అలాగే అంతే
జాగ్రత్తతో సంభాషణల్లోవాక్కుని
ప్రయోగించేటప్పుడు కూడా అప్రమత్తంగా వుండాలి"
అంటున్నాడు భరతముని.
" ఇక శ్రీకృష్ణుడు భగవద్గీతలో
అనుద్వేగకరమ్ వాక్యం సత్యం ప్రియ హింతం చ యత్
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప వుచ్యతే." !
దీని అర్థం - ఉద్వేగాన్నిఅంటే ఆంధోళన,
ఆవేదన, బాధ, కష్టం
వంటివి కలిగించకుండా, ప్రియముగా వుండేది, మంచిని చేసేదీ, యదార్దమైన అంటే అసత్యము లేకుండా
వుండే మాటలతో వున్న వాక్యమే వాక్యము. అని అర్థం. అంతేకాని
కర్త కర్మ క్రియ వున్న అన్ని రకాల సంభాషణలూ మాటలూ కావు, అవి
వాక్యములు కావు అని అర్థం. ఇదే అర్థాన్ని
ఇవే జాగ్రత్తలను వేద వాఙ్మయమైన ఉపనిషత్తులలో కూడా ఋషులు పేర్కొన్నారు. చూడండి.
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రుయాత్ సత్యమప్రియమ్
ప్రియంచ న అనృతం బ్రూయాత్, ఏ తత్ ధర్మ
సనాతనః
- ఉపనిషత్ వాఙ్మయం.
అంటే “సత్యాన్ని చెప్పాలి, ప్రియాన్ని చెప్పాలి, అప్రియమైన సత్యాన్నిఅది సత్యమే
అయినా సరే పొరపాటున కూడా చెప్పకూడదు. అలాగే అవతలి వారికి చాలా ఇష్టంగా ప్రియంగా
వుంటుంది కదా అని అబద్దాల్ని కల్పించి చెప్పకూడదు. ఇది సనాతన ధర్మం” అని కూడా అనునిత్యం, మహోన్నతమైన ఙ్ఞానులు, మననం చేసుకుని ప్రవచించే వేద వాఙ్మయం
చెపుతోంది. బహుశా ఇది మనం కొంచెం ఆలోచించవలసిందే అనుకుంటాను.
ఇక చివరిగా తేట తెలుగులో వేమన మహాకవి – మీరు ఎంత పేద వాళ్ళైనా బాధ పడవలసిన
అవసరం లేదని చెప్తూ..
"వాక్కు వలన కలుగు
వరమగు మోక్షంబు
వాక్కు వలన కలుగు వసుధ ఘనత ( వసుధ అంటే = భూమి )
వాక్కు వలన కలుగు పెక్కుడైస్వర్యముల్ ( అనేక సంపదలు )
విశ్వదాభిరామ వినుర వేమ." – వేమన
అంటూ ఆశలు రేకెత్తించి భరోసా ఇస్తున్నాడు. తెలుగు వారికి, అందులోనూ ఈ తేట తెలుగు పద్యానికి
అర్థం వివరించి చెప్పనవసరము లేదు కదా.
తమ తర్వాత వచ్చే తరాల వారమైన మన కోసం మనకు నష్టం కష్టం కలగకూడదనీ, కన్న తల్లుల కన్నాఎక్కువగా ఎంతగా ఆలోచించి ఆ జ్ఞానులు ఎంత స్పష్టంగా, ఎంత ప్రేమగా మనల్ని హెచ్చరిస్తున్నారో మరి మనం కూడా కొంచెం సాధన చేసి చూద్దామా..!
తమ తర్వాత వచ్చే తరాల వారమైన మన కోసం మనకు నష్టం కష్టం కలగకూడదనీ, కన్న తల్లుల కన్నాఎక్కువగా ఎంతగా ఆలోచించి ఆ జ్ఞానులు ఎంత స్పష్టంగా, ఎంత ప్రేమగా మనల్ని హెచ్చరిస్తున్నారో మరి మనం కూడా కొంచెం సాధన చేసి చూద్దామా..!
ఓర్పుగా చదివినందుకు కృతఙ్ఞతలతో ధన్యవాదాలు తెలుపుకుంటూ
డా.
గౌతమ్ కశ్యప్
Dr. Gautham Kashyap (శ్రీధర్) M.A., Eco., (A.U.,)
; M.A., Lit., PhD., (University of Madras)
Flat No. 204; Sai Kalyan Residency, Plot
No. 8, Kalyan Nagar Venture III,
Moti Nagar, Near Borabanda, Hyderabad - 500 018. Andhra Pradesh, India.
Mail kashyapgautham@gmail.com Ph :+91 88855 88090
ఈ వ్యాసం లో ఏమైనా
లోటు పాట్లుంటే వాటిని తెలియ జేస్తే తప్పని సరిగా పరిశీలించి సరిదిద్దుకుంటానని
సవినయంతో మనవి చేస్తూ ...
- గౌతమ్ కశ్యప్
- గౌతమ్ కశ్యప్

